video of the day

my slide show

Thursday, June 2, 2011

తెలంగాణ ఇవ్వడమే మేలు: ఎకనామిక్ టైమ్స్ సంపాదకీయం


Telangana
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటూ ఎకనమిక్ టైమ్స్ ఆంగ్ల పత్రిక తన సంపాదకీయాన్ని ప్రచురించింది. టైమ్ ఫర్ తెలంగాణ అంటూ ఓ సంపాదకీయాన్ని బుధవారం ప్రచురించింది. అందులో తెలంగాణ ఇప్పుడు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చెప్పారు. అంతేకాదు రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెసు ఏమీ నష్టపోదని తెలంగాణలో అనూహ్యంగా బలం పుంజుకుంటుందని సీమాంధ్రలో తాత్కాలికంగా మాత్రమే ప్రభావం పడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు, ఆర్థిక రంగానికి, కాంగ్రెసుకూ మేలు జరుగుతుందని స్పష్టం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇప్పటికి రాష్ట్రాల సంఖ్య రెండింతలకంటే ఎక్కువయ్యాయని తెలిపింది. రాష్ట్రాలు అన్ని భాషా లేదా జాతీయ ఉద్యమాల ద్వారానే ఏర్పడ్డాయని గుర్తు చేసింది.


తాజాగా ఏర్పడ్డ కొత్త రాష్ట్రాలు మాతృరాష్ట్రాల కంటే అభివృద్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వాటి మాతృ రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాయని స్పష్టం చేసింది. అటవీ, ఖనిజ సంపద ఉన్న తెలంగాణ కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సంశయం అవసరం లేదని తెలిపింది. అంతేకాదు కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోక పోవడానికి ఉన్న కారణాల్లో అన్నీ తొలగిపోయాయని కూడా పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బాగా వ్యతిరేకించి వ్యక్తి అని అలాంటి శక్తివంతమైన వ్యక్తి ఇప్పుడు లేరని తెలిపింది. అంతేకాదు ఇటీవలి ఉప ఎన్నికల్లో కూడా సీమాంధ్రలో జగన్ కాంగ్రెసును దెబ్బ తీసిన విషయాన్ని గుర్తు చేసింది. తెలుగుదేశం పార్టీ ఏం తేల్చుకోలేక ఊగిసలాడుతుందని తెలిపింది.


అయితే వైయస్‌కు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో లేరని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలిపింది. తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రలో జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకుంటుందని అయినప్పటికీ సీమాంధ్రలో తాత్కాలకంగా మాత్రమే ప్రభావం పడుతుందని తెలిపింది. ఒకవేళ తెలంగాణ ఇవ్వకుంటే నిత్యం రగులుతున్న అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలో సమస్య ఉంటుందని తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమంటే తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని బలంగా విశ్వసిస్తున్నారని తెలిపింది. తెలంగాణ ఏర్పాటుతో కోల్పోయేది కొద్దిగా అయితే వచ్చేది మాత్రం కొండంత అని తన సంపాదకీయంలో కాంగ్రెసుకు సూచించింది.
  

No comments:

Post a Comment